KCR MLA List 2023 : ముహూర్తం ఫిక్స్.. రేపు బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించనున్న కేసీఆర్..

Update: 2023-08-20 12:05 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఎలక్షన్ కు మరో 4 నెలల సమయం మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థుల ఎంపికలో బిజీ అయ్యాయి. అయితే ఈ రేసులో అధికార బీఆర్ఎస్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

105 మంది పేర్లు

బీఆర్ఎస్ నుంచి బరిలో దింపే అభ్యర్థుల ఎంపికను ఇప్పటికే పూర్తి చేసిన కేసీఆర్ సోమవారం ఉదయం 11.05 గంటలకు వారి పేర్లు ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శ్రావణ సోమవారం మంచిరోజు కావడంతో ఆయన 105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిజానికి ఫస్ట్ లిస్టులో 96 మంది పేర్లు మాత్రమే ఉంటాయని వార్తలు వచ్చినా 105 మంది పేర్లు అనౌన్స్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ముందుగా ప్రకటించినట్లే మెజార్టీ సిట్టింగ్లకు మళ్లీ టికెట్ దక్కే అవకాశమున్నట్లు సమాచారం.

10 మందికి నో ఛాన్స్?

ఇదిలా ఉంటే ఈసారి 10 మంది సిట్టింగులను సీఎం కేసీఆర్ పక్కనబెట్టినట్లు సమాచారం. నియోజకవర్గాలవారీగా సర్వే రిపోర్టు, స్థానిక నేతల అభిప్రాయాల మేరకు వారికి ఈసారి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలా టికెట్ రాని సిట్టింగులు, ఆశించి భంగపడ్డ అసంతృప్తులను ఇప్పటికే బుజ్జగించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే టికెట్ దక్కనివారికి ఎమ్మెల్సీ, ఎంపీ లేదా కార్పొరేషన్ పదవులు ఇస్తానని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. టికెట్ నిరాకరించిన 10 మంది సిట్టింగ్ లలో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కవితను కలిసి నేతలు

మరోవైపు టికెట్ పై ఆశలు పెట్టుకున్న కొందరు నేతలు తమ నియోజకవర్గాల్లో తామే ఎమ్మెల్యే అభ్యర్థులమంటూ ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిని మార్చి ఆ టికెట్ ను బండారి లక్ష్మారెడ్డి ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితను కలిసిన సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్ లు తామిద్దరిలో ఒకరికి టికెట్ ఇవ్వాలని, అలా జరగని పక్షంలో పరిణామాలు మారిపోతాయని ఆమెకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కవిత ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్లు సమాచారం.



Tags:    

Similar News