దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మూడు పథకాలను ఆయన ప్రారంభించనున్నారు. చేతి వృత్తుల వారికి రూ. లక్ష ఆర్థికసాయం, రెండో విడత గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి పథకాలను సీఎం ప్రారంభిస్తారు. వీటితో పాటు నస్పూర్ మండల కేంద్రంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ , భారత రాష్ట్ర సమితి కార్యాలయం, చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (సీఎల్‌ఐఎస్), మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు.
రెండో విడతలోలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.6,085 కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేయనున్నారు. ఇందులో ప్రభుత్వ వాటా రూ.4,563 కోట్లు కాగా లబ్ధిదారులు రూ.1,521 కోట్లు చెల్లించనున్నారు. ఈ పథకం తొలినాళ్లలో యూనిట్ ధర రూ.1.25 లక్షలు గా కాగా, మార్కెట్లో గొర్రెల ధర పెరగడంతో లబ్ధిదారులపై భారం పడకుండా ప్రభుత్వం ఒక్కో యూనిట్ ధరను రూ.1.75 లక్షలకు పెంచింది. ప్రమాదవశాత్తు మరణిస్తే ఒక్కో గొర్రెకు రూ.5 వేల, పొట్టేలుకు రూ.7 వేల బీమా అందిస్తున్నది.
సీఎం మంచిర్యాల టూర్ షెడ్యూల్
* సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 5 గంటలకు మంచిర్యాలకు చేరుకుంటారు.
* సాయంత్రం 5.10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారు.
* సాయంత్రం 5.30 గంటలకు కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
* సాయంత్రం 6.30కి బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు.
* రాత్రి 7.30కి రోడ్డు మార్గం ద్వారా తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.