ఆగస్టు 1న మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. ఈసారి ఎందుకంటే..?
సీఎం కేసీఆర్ మరోసారి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఇటీవలే 600 కార్ల భారీ కాన్వాయ్ తో ఆ రాష్ట్రానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆగస్టు 1న మరోసారి మహారాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ఆయన మహారాష్ట్ర దళిత నేత అన్నా బావ్ సాటే జయంతి ఉత్సవాలకు హాజరవుతారు. అనంతరం కొల్లాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత కేసీఆర్ సాహు మహరాజ్ మనుమడి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కానున్నారు. దళిత నేత జయంతి ఉత్సవాల్లో కేసీఆర్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు కూడా హాజరుకానున్నారు.
టీఆర్ఎస్ .. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పలు బహిరంగ సభలు నిర్వహించారు. వీలైనప్పుడల్లా అక్కడికి వెళ్తూ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ను తన అన్న కొడుకైన కల్వకుంట్ల వంశీధర్ రావును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 15 మందితో స్టీరింగ్ కమిటీ కూడా కేసీఆర్ ఏర్పాటు చేశారు.