రేపు సంగారెడ్డికి సీఎం కేసీఆర్.. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు భూమి పూజ

Update: 2023-06-21 17:19 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. పటాన్ చెరు పట్టణ కేంద్రంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. అనంతరం నాగులపల్లిలో రైల్వే కోచ్ తయారీ కేంద్రం, కొల్లూరులో డబుల్ బెడ్ రూం నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు.

సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, స్ధానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడిన మంత్రి హరీష్ రావు.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పటాన్ చెరులో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కొల్లూరులో గృహ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ ప్రాంతాలలో మల్టీపర్పస్ హెల్త్ సెంటర్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ప్రతీ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పధకాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ దగా పేరుతో నిరసనకు సిద్ధమవుతోందని హరీష్ రావు విమర్శించారు. ప్రజలు పండుగ చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ కళ్లలో నిప్పులు పోసుకుంటోందని మండిపడ్డారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు రావడం చూసి కాంగ్రెస్ పార్టీ కుళ్లుకుంటోందని అన్నారు.




Tags:    

Similar News