బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం కేసీఆర్ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయ పండితుల వేదాశీర్వచనం తీసుకున్నారు. స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలపై కేసీఆర్ సంతకాలు చేశారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే ప్రతిసారి కేసీఆర్ కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 9న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేయనున్న కేసీఆర్ ఇవాళ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
కేసీఆర్ కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిపై ఎనలేని నమ్మకం. ఏ ఎన్నికల్లో అయినా ఇక్క డ పూజలు చేసిన తర్వాతే ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. సీఎం కేసీఆర్, హరీశ్ రావు , ఇతర పార్టీ నేతలు ఎన్నికల సమయంలో వెంకన్నకు దర్శనం చేసుకొని స్వా మివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసి నామినేషన్ వేసిన ప్రతిసారి కేసీఆర్‌ను విజయం వరించింది.
కేసీఆర్ 1985లో మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో కోనాయిపల్లి ఆలయానికి వెళ్లి స్వామి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన కేసీఆర్.. ఈ ఆలయంలోనే పూజలు చేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని ప్రకటించడం విశేషం.
కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్. pic.twitter.com/hdpfYbF9jm
— Telugu Scribe (@TeluguScribe) November 4, 2023