ఈ నెల 16న పాలమూరు ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభించనున్న కేసీఆర్

Byline :  Krishna
Update: 2023-09-06 12:46 GMT

ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు - రంగారెడ్డి రెడీ అయ్యింది. ఈ నెల 16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ నిర్వహించనున్నారు. దీనిని నార్లాపూర్ ఇన్టెక్ వద్ద సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. వెట్‌ రన్‌లో భాగంగా రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సచివాలయంలో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ నెల 16న దక్షిణ తెలంగాణకు పండుగ రోజులాంటిదని సీఎం కేసీఆర్ అన్నారు. దైవకృప, ఇంజినీర్ల కృషితో అడ్డంకులు అధిగమించి పాలమూరు ఎత్తిపోతల పథకం సాకారమైందన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందనుందని చెప్పారు. దీంతో బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానుందని సీఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

పట్టుదలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తీసుకొచ్చిన సీఎంఓ అధికారులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని గ్రామాల్లోని దేవాలయాల్లో దేవుళ్లకు ఎత్తిపోసిన జలాలతో అభిషేకం చేయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఇక వెట్‌ రన్‌ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి జిల్లాల్లోని పల్లెపల్లె నుంచి హాజరుకానున్న ప్రజలు, గ్రామ సర్పంచులు హాజరుకానున్నారు.

Tags:    

Similar News