అబద్దాలతో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నరు: సీఎం రేవంత్ రెడ్డి

Byline :  Bharath
Update: 2023-12-20 15:18 GMT

బీఆర్ఎస్ పార్టీ తమ పాలనలో చేసిన తప్పులను.. ఇంకా అబద్దాలతో సభను తప్పుదోవ పట్టించాలని చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం (డిసెంబర్ 20) జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో రూ.లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. అబద్దాలతో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ.. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుల్లా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. స్వరాష్ట్రం ఏర్పడకముందు కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సంపదను ఖర్చు చేసి.. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో రూ.13 లక్షల 72వేల కోట్లు ఖర్చు చేసినా.. ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.

పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేయలేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయకుండా.. పేదలను ఇబ్బందులకు గురిచేశారు. సెక్రటేరియట్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, రాష్ట్రంలో మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెలా మొదటి తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని రేవంత్ మండిపడ్డారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందే వైన్స్ టెండర్లు వేసి.. ఉన్నదంతా దోచుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్త విధ్వంసకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్ కడతామన్నారు. నిజాలు చెప్తుంటే రాష్ట్రం పరువు పోతుందంటున్నారు. కానీ ఊరుకుంటే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది. అందుకే వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News