నాగోబా ఆలయ అభివృద్ధికి రూ. 7 కోట్లు మంజూరు: సీఎం రేవంత్ రెడ్డి

By :  Bharath
Update: 2024-02-02 11:14 GMT

ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లోని నాగోబా ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంతో కలిసి ఆలయాన్ని దర్శించుకున్నారు. పూజాకార్యక్రమం అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించిన సీఎం.. అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్.. నాగోబా ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 7 కోట్లు కేటాయించిందని ప్రకటించారు. కేస్లాపూర్‌లో మహిళా సంఘాల సభ్యులతో ముఖాముఖి నిర్వహించిన సీఎం రేవంత్.. మహిళా సంఘాలకు రూ.60 కోట్ల బ్యాంక్ లింకేజ్ నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

స్వయం సహాయక బృందాలకు స్కూల్‌ యూనిఫామ్‌లు కుట్టే అవకాశం కల్పిస్తామని రేవంత్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. త్వరలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం మొదలవుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరెంట్ బిల్లులు కూడా ఎక్కువగా ఉన్నాయని.. 200 యూనిట్ల ఉచితంగా కరెంట్ త్వరలో అందిస్తామని రేవంత్ అన్నారు. మహిళల ఆత్మగౌరవం నిలబెట్టేలా కాంగ్రెస్ పనిచేస్తుందని, గతంలో కాంగ్రెస్ సీఎంలు మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చారని సీఎం గుర్తుచేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ తీరుపై సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు. మహిళలకు ఉచిత బస్సు రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకు? రెవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్ని హామీలను తప్పక అమలు చేసి తీరుతుందని అన్నారు.



Tags:    

Similar News