కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కుతాయన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కని వారు, చాలా కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న వారు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల్లో ఉన్నవారంతా నామినేటెడ్ పోస్టులపై గంపెడాశతో ఉన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం తాజాగా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రయారిటీ ఉంటుందన్నారు.
సన్నిహితులు, బంధువులు అనే ప్రాతిపదికన పదవులు ఇవ్వమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే ఈ అంశంపై స్పష్టత ఇచ్చామని చెప్పారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసినవారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని.... ఇచ్చిన హామీ మేరకే త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో, దానివల్ల ఏ మేరకు న్యాయం జరుగుతుందో నిశితంగా ఆలోచించి నిర్ణయం ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు.