తెలంగాణ అంటే ఓ భావోద్వేగమని, సుదీర్ఘ పోరాటం, వందలాది ప్రాణ త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన సభలో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం రోజున కేసీర్ సభకు రాకపోవడాన్ని రేవంత్ తప్పుబట్టారు. 80వేల పుస్తకాలు చదవానని పదే పదే చెప్తే ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం సరికాదని అన్నారు. కేసీఆర్ సభకు వచ్చి సలహాలు సూచనలు ఇస్తారని అనుకున్నానని చెప్పారు. ఇప్పటికైనా ఆయన సభకు వచ్చి తన అపారమైన అనుభవంతో సూచనలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
సమైక్యాంధ్రలో ఉన్న నిర్బంధాలు బీఆర్ఎస్ 9 ఏండ్ల పాలనలోనూ కొనసాగాయని రేవంత్ చెప్పారు. 9ఏండ్లైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని వాపోయారు. అందుకే రాష్ట్రంలో కుటుంబ పాలనపై ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారని రేవంత్ అన్నారు. ప్రమాణ స్వీకారం రోజునే దొరల గడీలు బద్దలుకొట్టామని చెప్పారు. గత ప్రభుత్వం ఎన్నో లోపభూయిష్టమైన నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా దివాళా తీయించిందని అన్నారు. ఇప్పుడు వంద రోజుల పాలన పూర్తికాక ముందే తమ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతోందని విమర్శించారు. అవి పిల్లి పెట్టే శాపనార్థాలులా ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సకాలంలో జీతాలు అందక ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఒకటో తారీఖునే జీతభత్యాలు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు.
కోట్లాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఓర్వలేక విమర్శిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ఉచిత బస్సు వల్ల దేవాదాయ శాఖ ఆదాయం కూడా పెరిగిందని అన్నారు. ప్రజావాణిలో హౌసింగ్, ధరణిపై ఎక్కువ ఫిర్యాదు వస్తున్నాయని, ఇదంతా ఎవరు మూటగట్టుకున్న పాపామో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 25 శాతం పదవులు మైనార్టీలకు ఇచ్చామని స్పష్టం చేశారు.