Revanth Reddy : సోనియా తెలంగాణ నుంచి పోటీ చేయాలి.. టీపీసీసీ తీర్మానం
టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి మూడు తీర్మానాలు ప్రతిపాదించారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీకి అభినందనలు తెలుపుతూ తొలి తీర్మానం ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమన్వయంతో పనిచేసిన మాణిక్‌రావు ఠాక్రేను అభినందిస్తూ రెండో తీర్మానం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ మూడో తీర్మానం చేయగా.. సభ్యులంతా ఏకగ్రీవ ఆమోదం తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని రేవంత్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. టార్గెట్ 17 పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 12కు తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలిపించుకోవాలన్నారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమీక్షిస్తామన్న సీఎం.. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇన్‌ఛార్జ్లతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 14 నుంచి 4 రోజుల పాటు సీఎం రేవంత్ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎంతోపాటు మంత్రి శ్రీధర్ బాబుకు వెళ్తారు.
బీజేపీ - బీఆర్ఎస్ తోడు దొంగలు అని.. రెండు పార్టీలు కలిసే కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని రేవంత్ ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై జ్యుడీషియల్ విచారణ జరిపిస్తామన్నారు. కానీ కిషన్ రెడ్డి సీబీఐ ఎంక్వైరీ అంటూ బీఆర్ఎస్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్‌ఎస్ దోచుకుందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సూచించారు.