CM Revanth Reddy : TSPSC ప్రక్షాళనకు సీఎం ఆదేశం

Update: 2023-12-12 16:28 GMT

TSPSC ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి వరుస సమీక్షలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై సీఎం పోకస్ చేశారు. నిరుద్యోగుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా వేగంగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లు, నిర్వహించిన పరీక్షలు తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి సీఎస్ శాంతి కుమారి, సీఎస్ కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవీ గుప్తా, అడిషనల్ డీజీ సీవీ ఆనంద్, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, సిట్ స్పెషల్ అధికారి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ పరీక్షల నిర్వహణలో ఇతర బోర్డుల పని తీరుపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఈ నేపథ్యంలోనే ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పని తీరుపై అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని తెలిపారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకంగా చేపట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం టీఎస్పీఎస్సీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సిబ్బందితో పాటు ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు.



Tags:    

Similar News