ధరణిపై సీఎం రేవంత్‌ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Byline :  Shabarish
Update: 2024-02-24 16:12 GMT

ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం తెలంగాణ సచివాలయంలో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించి అధికారులపై సీరియస్ అయ్యారు. ధరణి నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించడమే కాకుండా ధరణిలో లోపాలు ఉన్నట్టు గుర్తించారు.

ధరణి పోర్టల్ నిర్వహణ ఏజెన్సీలపై విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2020లో అమల్లోకి వచ్చిన ఆర్వో ఆర్ చట్టంలోనే లోపాలున్నాయని సీఎంకు ధరణి కమిటీ అధికారులు వివరించారు. మార్చి మొదటివారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నట్లు సర్కార్ చెబుతోంది. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుది నివేదిక వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అప్పటివరకు వెంటనే పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.


Tags:    

Similar News