Revanth Reddy : తెలంగాణలో కులగణనపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం

Byline :  Krishna
Update: 2024-01-27 14:16 GMT

ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతోంది. తెలంగాణలో కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై సీఎం రివ్యూ నిర్వహించారు. అధికారంలోకి వస్తే బీసీ జన గణన చేపడతామని చెప్పామని.. దీనికి అనుగుణంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని సీఎం భావిస్తున్నారు. బీసీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

మరోవైపు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే ప్రణాళికలు రూపొందించాలన్నారు. తెలంగాణలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా నిధులు విడుదల చేయాలని..అంతేగాక గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలాలు గుర్తించి, అంచనాలు తయారు చేయాలని సూచించారు.


Tags:    

Similar News