Revanth Reddy: 'రేపు కేసీఆర్ స్థానంలో హిమాన్ష్ కూడా వస్తా అంటారు..?'.. సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ కాలం చెల్లిపోయిన మెడిసిన్ అని, అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. బీఏసీ మీటింగ్ కి కూడా హాజరు కాలేదంటే ఆయన చిత్తశుద్ధి ఎంటో తెలుస్తుందన్నారు. కేసీఆర్ కమిట్మెంట్ ప్రజలకు అర్థమైంది కానీ ఆయన కమిట్మెంట్ పై డౌట్ ఉన్నది హరీష్ రావుకేనన్నారు. బీఏసీ మీటింగ్ అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు రేవంత్. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం మార్పు స్పీకర్ నిర్ణయమని, స్పీకర్ నిర్ణయానికి తాము బాధ్యులు అంటే ఎలా అని ప్రశ్నించారు. బీఏసీ మీటింగ్ ఎవరిని అనుమతించాలో అనుమతించకూడదో అనేది స్పీకర్ నిర్ణయమన్నారు.
బీఏసీ సమావేశానికి రాకుండా హరీష్ రావును మేం ఎలా అడ్డుకుంటామని.. బీఆర్ఎసే కేసీఆర్, కడియం శ్రీహరి హాజరు అవుతారని పేర్లు ఇచ్చారని తెలిపారు. హరీష్ రావు పేరు లేకపోవడంతోనే మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం తెలిపారని.. బీఏసీకి ఆయనను అనుమతించాలో లేదో స్పీకర్ నిర్ణయమని స్పష్టం చేశారు.కేసీఆర్ బదులు హరీష్ రావు వచ్చారని అనుమతిస్తే.. రేపు హిమాన్షు కూడా మీటింగ్ కూడా వస్తానంటారని విమర్శించారు. కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటున్నామని , ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన విధులు నిర్వర్తించాలన్నారు.
కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందన్నారు సీఎం. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించుకోవాలని చెప్పారన్నారు. రిటైర్డ్ జడ్జీతో విచారణపై సభలో చర్చిస్తామన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు చూశారని, అందుకే కృష్ణా పరివాహక ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చారన్నారు. సాగర్ ను జగన్ ఆక్రమిస్తే కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రతిరోజూ 12 టీఎంసీల నీటిని తరలించే పనిచేసింది కేసీఆర్ కాదా అని అన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ఆలోచించడం మానేశారన్నారు. మిషన్ భగీరథపై విచారణకు ఆదేశించామని సీఎం రేవంత్ అన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టతతో ఉన్నామని, విధానపర లోపాలు లేకుండా పాలన సాగిస్తున్నామన్నారు.