CM Revanth reddy : టీఎస్పీఎస్సీ ప్రక్షాళన.. యూపీఎస్సీ ఛైర్మన్తో సీఎం రేవంత్ భేటీ

Byline :  Kiran
Update: 2024-01-05 08:46 GMT

అధికారం చేపట్టిన నాటి నుంచి పరిపాలనలో తన మార్కు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక మార్పు దిశగా అడుగులేస్తున్నారు. గందరగోళంగా మారిన టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని పక్కనబెట్టి కొత్త మోడల్ ప్రవేశపెట్టాలని భావిస్తున్న ఆయన.. యూపీఎస్సీ సహకారం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి యూపీఎస్‌సీ ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు.

రేవంత్, సోనిల భేటీ దాదాపు గంట సేపు సాగింది. ఇందులో తొలుత యూపీఎస్సీ పనితీరు, పరీక్షల నిర్వాహణ గురించి రేవంత్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీఎస్పీఎస్సీలో జరిగిన లోటుపాట్లు, తప్పొప్పులను యూపీఎస్సీ ఛైర్మన్ దృష్టికి తెచ్చారు. నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వాహణ, ఫలితాల వెల్లడికి సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళకు సహకరించాల్సిందిగా మనోజ్ సోనీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీలో సమూల మార్పులు చేయాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి.. ఇప్పటికే రాష్ట్ర బృందాన్ని కేరళకు పంపి అక్కడి సర్వీస్ కమిషన్ పనితీరుపై అధ్యయనం చేయించారు.

గత ప్రభుత్వ హయాంలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఫలితంగా పలు పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోటీ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించలేకపోయిందన్న అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళకు రేవంత్ రెడ్డి నడుం బిగించారు. 


Tags:    

Similar News