నేటి సీఎం రేవంత్ రెడ్డితో ధరణి కమిటీ భేటీ.. ఆ భూములపైనే చర్చ

Byline :  Vamshi
Update: 2024-02-24 03:26 GMT

ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌కి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారులు, వక్ఫ్, దేవాదాయ, అటవీశాఖల అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. ధరణి ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారంలోనూ వేగంగా ముందుకెళ్లాలని సర్కార్ భావిస్తోంది. ఈ సందర్భంగా కమిటీ ఇప్పటివరకు గుర్తించిన అంశాలను సీఎం కు వివరించినట్టు తెలిసింది.

నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా వారు ఇచ్చే సమాచారం ఆధారంగా ఒక ప్రాథమిక నివేదిక రూపొందిస్తామని చెప్పినట్టు సమాచారం. దీంతో శనివారం కలెక్టర్ల సమావేశం అనంతరం ఈ అంశంపై సమగ్రంగా చర్చిద్దామని ధరణి కమిటీకి సీఎం సూచించినట్టు తెలిసింది. వేలాది ఎకరాల దేవాదాయ, వక్ఫ్ బోర్డుకు చెందిన భూములు మాయమయ్యాయన్న ఆరోపణలతో కమిటీ ప్రత్యేకంగా దీనిపై అధికారులతో చర్చించి ఎక్కడెక్కడ భూములు ఆక్రమణకు గురయింది? ఇతరుల చేతుల్లోకి వెళ్లింది? వంటి అంశాలను పరిశీలిస్తుంది. ఇప్పటికే ధరణి పోర్టల్ లో వీటికి సంబంధించిన భూములను రికార్డుల పరంగా కొందరి సొంతమయినట్లు ఆరోపణలు రావడంతో కమిటీ ప్రత్యేకంగా ఈ రెండు భూముల విషయంపైనే సమావేశం జరుపుతుంది.

Similar News