తెలంగాణలో కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ఓఆర్ఆర్‌కు వెలుపల.. ఆర్ఆర్ఆర్‌కు లోపల 500 నుంచి 1000 ఎకరాల భూసేకరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేటాయించిన భూములు కూడా ఎయిర్ పోర్టుకు, నేషనల్ హైవేలకు వంద కిలో మీటర్లలోపు ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాడల అభివృద్ధిపై సచివాలయంలో.. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. పరిశ్రమల కోసం కేటాయించే భూములు బంజరు భూములై ఉండాలని, సాగుకు యోగ్యం కానివి అయి ఉండాలని అధికారులకు సూచించారు.
రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా.. కాలుష్యం తక్కువగా ఉండేలాగ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. పరిశ్రమలకు భూములు కేటాయించినప్పటికీ.. ఉపయోగించకుండా ఉన్న భూములపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని, హైదరాబాద్ లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడల ప్రత్యామ్నాయాలను సూచించాలన్నారు.