First Cabinet Meeting : విద్యుత్ శాఖలోని వాస్తవాలు దాచిపెట్టడంపై సీఎం సీరియస్
తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ... గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు, ఎలక్ట్రిసిటి డిపార్డ్‌మెంట్‌పై చర్చించారు. భేటీలో సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. తొలి కేబినెట్ సమావేశంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌పై హాట్ హాట్‌గా చర్చ జరిగింది. విద్యుత్ రివ్యూ సమావేశంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం మండిపడ్డారు. విద్యుత్ శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు.
ఆ అప్పుల వివరాలతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశించారు. రేపటి రివ్యూకు సీఎండీ ప్రభాకర్ రావును(CMD Prabhakar rao) రప్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇక ఈరోజు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి రావ్ పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. అనంతరం సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష చేయనున్నారు. 2014 నుండి విద్యుత్ శాఖలో జరిగిన కొనుగోళ్లపై పూర్తి వివరాలతో సమీక్షకు రావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.