డ్రగ్స్‌ వెనుక ఎంత పెద్దోళ్లున్నా జైలుకు పంపుతాం - సీఎం రేవంత్‌ రెడ్డి

Byline :  Kiran
Update: 2023-12-16 12:24 GMT

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. డ్రగ్స్ ఘటనపై సిట్ వేయాలని తాను ఎంతో పోరాటం చేశానని గుర్తు చేశారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా రేవంత్ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. డ్రగ్స్ కేసు విచారణలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. డ్రగ్స్ విచారణ ఎందుకు అటకెక్కిందని ప్రశ్నించారు. మత్తు మందు కోరల్లో చిక్కుకున్న పంజాబ్ లాగే మన రాష్ట్రాన్ని తయారు చేశారని మండిపడ్డారు. దాన్ని అరికట్టేందుకు తమ ప్రభుత్వం పటిష్ట ప్రణాళికతో వెళ్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

డ్రగ్స్ విషయంలో సంబంధమున్నవారు ఎంతవారైనా ఉపేక్షించే ప్రసక్తేలేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దుల్లోకి డ్రగ్స్, గంజాయి వస్తే సహించేదిలేదని తెగేసి చెప్పారు. ఈ విషయంలో ఎంత పెద్ద వాళ్లున్నా జైలుకు వెళ్లాల్సిందేనని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రానికి గంజాయి తీసుకురావాలంటే భయపడేలా, ఎవరైనా డ్రగ్స్ తీసుకోవాలంటే వణికేలా చేస్తామని చెప్పారు. వచ్చే పదేళ్లు తామే అధికారంలో ఉంటామని జోస్యం చెప్పారు.

Tags:    

Similar News