రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దాం: రేవంత్‌రెడ్డి

Byline :  Veerendra Prasad
Update: 2023-12-14 06:08 GMT

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. గురువారం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌తో పాటు అన్ని పార్టీలకు చెందిన సభ్యులు స్పీకర్‌గా నియామకమైన గడ్డం ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

స్పీకర్‌ ఎన్నికకు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి. మంచి సంప్రదాయానికి సభ తొలిరోజే నాంది పలికిందని, భవిష్యత్‌లోనూ ఇదే సంప్రదాయం కొనసాగాలన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని తెలిపారు. సమాజంలోని రుగ్మతలను శాసనసభ ద్వారా పరిష్కరిద్దామని చెప్పారు. గడ్డం ప్రసాద్ అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారన్న సీఎం... ఎమ్మెల్యేగా, మంత్రిగా గడ్డం ప్రసాద్ విశేష సేవలు అందించారన్నారు. గడ్డం ప్రసాద్ మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాద్ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఫలితాలు అనుకూలంగా రాకపోయినా గడ్డం ప్రసాద్ ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. సభలో సభ్యులందరి హక్కులు కాపాడుతారని నమ్మకం ఉందని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా సభను నడుపుతారని ఆశిస్తున్నాని అన్నారు.

స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు అభినందనలు తెలిపారు భట్టి విక్రమార్క. మంత్రిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్‌ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించారని, ఆయనతో కలిసి పని చేసినందుకు గర్విస్తున్నానని చెప్పారు.ప్రజల సమస్యల పరిష్కారం దిశగా గడ్డం ప్రసాద్‌ సలహాలు ఇవ్వాలని కోరారు. ఇక కేసీఆర్‌ ఆదేశాలతో స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ సహకరించిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్‌. ఎంపీటీసీ నుంచి స్పీకర్‌గా ఎదిగిన గడ్డం ప్రసాద్ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు

Tags:    

Similar News