CM Revanth Reddy : వనదేవతల్ని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Byline :  Kiran
Update: 2024-02-23 09:51 GMT

సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వన దేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సీఎం హోదాలో తొలిసారి అమ్మవార్లను దర్శించుకున్న రేవంత్ రెడ్డి.. నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. 4 కోట్ల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఏ ముఖ్య కార్యక్రమం చేపట్టాలన్నా వన దేవతల ఆశీర్వాదం తీసుకుంటామని అన్నారు.

గతేడాది మేడారం నుంచే హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. ఏడాది తిరిగే సరికి అమ్మల దయవల్ల అధికారంలోకి వచ్చామని అన్నారు. మేడారం జాతరకు వచ్చే కోటిన్నర మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు రేవంత్ చెప్పారు. భక్తుల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 6వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని అన్నారు. మంత్రులు బృందంగా ఏర్పడి ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలకుండా చూసుకుంటున్నారని రేవంత్ స్పష్టం చేశారు. మేడారంకు వెళ్లలేని భక్తుల కోసం ఆన్ లైన్లో మొక్కులు చెల్లించే ఏర్పాటు చేశామని చెప్పారు. గిరిజన సంప్రదాయాల ప్రకారం మేడారాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.




Tags:    

Similar News