తెలంగాణ నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పనున్నారు. వచ్చే రెండు రోజుల్లో ఉద్యోగాల భర్తీపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లు, వాటి భర్తీ తదితర అంశాలపై సీఎం అధికారులతో చర్చించనున్నారు. ఇక రివ్యూ మీటింగ్ కు రావాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డిని సీఎంవో కార్యాలయం ఆదేశించింది. ఉద్యోగాల భర్తీని వీలైనంత త్వరగా చేపట్టాలని సీఎం ఈ రివ్యూలో ఆదేశించనున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రిలీజైన ఉద్యోగ నోటిఫికేషన్లన్నింటినీ భర్తీ చేసి నిరుద్యోగులను సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ పార్టీ శరవేగంగా చర్యలు చేపట్టనునట్లు తెలుస్తోంది.
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం.. ఉద్యోగాల భర్తీలో మాత్రం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీక్ కావడం, మిగతా ఉద్యోగాల భర్తీ ముందుకు సాగకపోవడంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాల భర్తీతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. వీలైనంత తొందరగా నియామకాలు చేపట్టేలా ముందుకు సాగుతున్నట్లు సమాచారం.