నేడు మరో 5,278 మందికి ఉద్యోగ నియామక పత్రాలు

Byline :  Shabarish
Update: 2024-03-04 03:32 GMT

ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చింది. అందులో భాగంగా టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం రేవంత్ ఇది వరకే వెల్లడించారు. జనవరిలో 7094 మంది స్టాఫ్ నర్సులకు ఒకేసారి ఉద్యోగ నియామకపాత్రాలు అందించారు. తాజాగా నేడు 5,278 మందికి ఉద్యోగ నియామకపత్రాలను సీఎం రేవంత్ అందించనున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని పలువురు నేతలు చెబుతున్నారు.

గతంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కోర్టులో కేసులు ఉన్నాయని, వాటిని తమ ప్రభుత్వం పరిష్కరిస్తోందని అన్నారు. ఆయా పోస్టులను భర్తీ చేస్తూ వస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా నేడు ఐదు వేలకు పైగా ఉద్యోగాల భర్తీని చేపడుతున్నారు.

సంక్షేమ గురుకులాల్లో ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీ), డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగానికి 4,638 మంది ఎంపికయ్యారు. అలాగే పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో 565 మంది, వైద్య శాఖలోని వివిధ విభాగాల్లో 75 మంది ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. పోస్టులకు ఎంపికైన వారికి నేడు హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో సీఎం రేవంత్‌ చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఉన్న తరుణంలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.


Tags:    

Similar News