కాంగ్రెస్ చేతిలో కమ్యూనిస్టులు.. ఖరారైన పొత్తు?
కాంగ్రెస్, కామ్రేడ్ల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్తో పొత్తు లేదని తేలడంతో కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సీపీఐ, సీపీఎం పార్టీల అగ్రనేతలు కాంగ్రెస్ నేతలతో పలు దఫాలుగా పొత్తులపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆరు స్థానాలు కేటాయించాలని కమ్యూనిస్టులు కాంగ్రెస్ను కోరినట్లు సమాచారం. అయితే కామ్రేడ్ల డిమాండ్లపై స్పందించిన కాంగ్రెస్ కేవలం రెండు సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
2 సీట్లు మాత్రమే..
నిజానికి సీపీఐ, సీపీఎంలు కాంగ్రెస్ను ఆరు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరాయని వార్తలు వచ్చాయి. వాటిలో ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, ఖమ్మం జిల్లా కొత్తగూడెం, పాలేరు, నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, మునుగోడు నియోజకవర్గాలు ఉన్నాయి. సీపీఐ పార్టీ హుస్నాబాద్ ,బెల్లంపల్లి, మునుగోడు, కొత్తగూడెం స్థానాల్లో పోటీ చేయాలని భావించగా.. సీపీఎం పాలేరు, మిర్యాలగూడ సీట్లు ఆశించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం సీపీఐకు ఒకటి ,సీపీఎంకు ఒకటి చొప్పున రెండు స్థానాలు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, మిర్యాలగూడ స్థానం నుంచి జూలకంటి రంగారెడ్డి బరిలో దిగనున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది.
కేసీఆర్ హ్యాండివ్వడంతో
నిజానికి కేంద్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య సత్సంబంధాలున్నాయి. రాష్ట్రంలోనూ అలాంటి సంబంధాలే కొనసాగుతాయని కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కమ్యూనిస్టులు మాత్రం కేసీఆర్ వైపు మొగ్గు చూశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్ తమతో పొత్తు పెట్టుకుంటారని, కనీసం నాలుగైదు సీట్లైనా కేటాయిస్తారని కామ్రేడ్లు ఆశపెట్టుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేసిన కేసీఆర్ కమ్యూనిస్టులతో పొత్తు ఉండదని తేల్చి చెప్పేశారు. నాలుగు స్థానాలు మినహా 115 నియోజకవర్గాల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత నిర్ణయంతో కామ్రేడ్లకు పెద్ద షాకే తగిలింది. ఇదే సమయంలో కాంగ్రెస్తో జట్టు కట్టేందుకు సిద్ధమన్న సిగ్నల్స్ పంపారు. కాంగ్రెస్ సైతం కామ్రేడ్లతో దోస్తీకి సై అన్నప్పటికీ సీట్ల విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తేలేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పొత్తులో భాగంగా సీపీఐ, సీపీఎంలకు చెరో స్థానం కేటాయించినట్లు సమాచారం.