కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలోకి మరో ఇద్దరు నేతలు

By :  Kiran
Update: 2023-10-03 09:27 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లోనే నోటిఫికేషన్ రానుంది. ఈ క్రమంలో పార్టీలన్నీ జోరు పెంచాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించగా.. బీజేపీ బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపికలో తలమునకలైంది. ఈసారి క్యాండిడేట్ల ఎంపిక కోసం సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్.. సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీ మురళీధరన్ అధ్యక్షతన గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని, బాబా సిద్ధికి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. గత నెలలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధు యాష్కిలకు అందులో స్థానం కల్పించింది. తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ స్క్రీనింగ్ కమిటీలో మరో ఇద్దరికి చోటు ఇచ్చింది.

పార్టీ సీనియర్ నేతలైన బలరాం నాయక్, షబ్బీర్ అలీని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలోకి తీసుకుంది. అన్ని వర్గాలకు సమప్రాధాన్యం ఇచ్చే లక్ష్యంతోనే అధిష్టానం ఈ ఇద్దరికీ అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేతలుకాగా.. బీసీ వర్గానికి చెందిన మధుయాష్కీ గౌడ్, ఎస్సీ వర్గానికి చెందిన సీఎల్పీ నేత

భట్టి విక్రమార్క స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలో ఎస్టీ, మైనార్టీలకు అన్యాయం జరిగే అవకాశముందన్న వాదనలకు అవకాశమివ్వకుండా కాంగ్రెస్ హైకమాండ్ ఆ చెందిన వర్గాలకు బలరాం నాయక్, షబ్బీర్ అలీకి స్క్రీనింగ్ కమిటీలో చోటు కల్పించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ ఇప్పటికీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయలేదు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఎంపిక చేసిన అభ్యర్థులపై కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సంతృప్తిగా లేదన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వారు క్యాండిడేట్ల గురించి రీ సర్వే చేయిస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇతర పార్టీల నుంచి నేతల వలసలు కొనసాగుతుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం వేచిచూసే ధోరణి అవలంబిస్తోందన్న వాదనలు ఉన్నాయి. ఏదేమైనా స్క్రీనింగ్ కమిటీలో మరో ఇద్దరు సభ్యులు కొత్తగా చేరడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశముందని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News