ఎస్సీ, ఎస్టీలకు రూ. 12 లక్షలు.. కాంగ్రెస్ దళిత డిక్లరేషన్

Update: 2023-08-26 14:34 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ జనాకర్షక హామీలు ప్రకటించింది. శనివారం రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో జరిగిన ‘ప్రజాగర్జన’ సభలో దళిత డిక్లరేషన్ ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకానికి పోటీగా పలు హామీలు గుప్పించింది. దళితులు, గిరిజనుa సంక్షేమానికి తమ పార్టీ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని, తాము అధికారంలోకి వస్తే వారి జీవితాల్లో సమూల మార్పు తెస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో రేవంత్ డిక్లరేషన్ వివరాలను వెల్లడించారు. ‘‘కేసీఆర్‌ పాలనలో దళితులు, గిరిజనులు మోసపోయారు. వారికి న్యాయం చేయడానికి సోనియా గాంధీ ఆదేశాల మేరకు మేం దళిత డిక్లరేషన్‌ తీసుకొచ్చాం’’ అని చెప్పారు. సభ ప్రారంభంలో.. ఇటీవల చనిపోయిన ప్రజాగాయకుడు గద్దర్‌ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. సభలో పలు జిల్లాల నుంచి వచ్చిన వేర్వేరు పార్టీల నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

దళిత డిక్లరేషన్.. ముఖ్యాంశాలు..

ఎస్సీ వర్గీకరణ అమలు.. ఎస్సీల రిజర్వేషన్ 18 శాతానికి, ఎస్టీలకు 12 శాతానికి పెంపు

అంబేడ్కర్‌ అభయహస్తం పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు

పదో తరగతి పాసైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 10 వేలు

డిగ్రీ పాసైతే రూ. 25 వేలు, పీజీ పాసైతే రూ. లక్ష

ప్రతి మండలంలోనూ ప్రత్యేక గురుకుల పాఠశాల

డిగ్రీ, పీజీ చదివే ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు హాస్టల్ వసతి

ప్రభుత్వం కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు

దళిత కుటుంబాల పోడు భూములకు పట్టాలు

ఎస్సీ, ఎస్టీల సంక్షేమ కోసం 3 కార్పొరేషన్లు, రూ. 750 కోట్ల కేటాయింపు

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 6లక్షల ఆర్థిక సాయం, ఇళ్ల స్థలాలు

తెలంగాణలో ఐదు ఐటీడీఏల ఏర్పాటు

విదేశీ వర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్థిక సాయం



Tags:    

Similar News