ఔటర్ లాబీలో కేసీఆర్కు చిన్న గది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యంతరం
అసెంబ్లీలో మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. ఏళ్ల తరబడి ప్రతిపక్ష నేతకు ఇస్తున్న కార్యాలయాన్ని కాకుండా చిన్న గదిని కేటాయించింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేటాయించిన చాంబర్ ను రెండో సమావేశాల్లో మార్చడమేంటని.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఇన్నర్ లాబీలో ఉన్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇప్పుడు ఔటర్ లాబీలోని చిన్న గదిలోకి మార్చింది. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 30 మంది ఎమ్మెల్యేలున్న ప్రతిపక్ష నేతకు చిన్న గది కేటాయించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై ఆందోళన చేస్తూ.. స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి తమ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అనంతరం మీడియా పాయింట్ వద్దకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్ది మాట్లాడుతూ.. కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. గతంలో ప్రతిపక్ష నేత కార్యాలయం కంటే ఇది చాలా చిన్నదని అన్నారు. ప్రతిపక్ష నేతలను అవమానించేలా ప్రభుత్వ చర్య ఉందని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.