Telangana congress: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం -రాహుల్ గాంధీ

By :  Kiran
Update: 2023-09-24 11:22 GMT

నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, మధ్య ప్రదేశ్, చత్తీస్ఘడ్, రాజస్థాన్ లో తమ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి సర్ప్రైజ్ ఇస్తామని రాహుల్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేర్చుకున్న విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలున్నాయన్న రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘఢ్‌లో కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో విజయానికి దగ్గరల్లో ఉన్నామని.. అక్కడ కూడా గెలుపు తమదేనని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయం బీజేపీకి కూడా తెలుసని అన్నారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక విషయాలు నేర్చుకున్నామని రాహుల్ చెప్పారు. ప్రతిపక్షాల వాదనలు జనాల వరకు చేరకుండా బీజేపీ ప్రజల దృష్టి మరల్చి ఎన్నికల్లో విజయం సాధిస్తోందని విమర్శించారు. బీజేపీ పాచిక పారకుండా చేసి తాము ఆ రాష్ట్రంలో విజయం సాధించామని చెప్పారు. పార్లమెంటు స్పెషల్ సెషన్ లో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్ స్పందించారు. రమేష్‌ బిధూరి, నిషికాంత్‌ దూబే వంటి నేతలు విద్వేషాలను రెచ్చగొట్టి కుల గణన అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మీడియాను బీజేపీ కంట్రోల్ చేస్తోందని రాహుల్ ఆరోపించారు.

దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఆర్థిక, మీడియా దాడులను ఎదుర్కొంటున్నాయని రాహుల్ అభిప్రాయపడ్డారు. అయినా వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలకు మద్దతు ప్రకటించినా, ఆర్థిక సాయం చేయాలనుకున్నా ఏమవుతుందో దేశంలో ఏ వ్యాపారవేత్తను అడిగినా చెబుతారని అన్నారు.

Tags:    

Similar News