కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో రాష్ట్ర కాంగ్రెస్లో కొత్త జోష్ కనిపించింది. అదే ఊపుతో తెలగాణలోనూ అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేసింది. భారీ బహిరంగ సభలు నిర్వహించి డిక్లరేషన్లు ప్రకటించింది. పార్టీ ఊహించినట్లుగానే వలసలు పెరిగాయి. ఒక దశలో కాంగ్రెస్ పెరుగుతున్న గ్రాఫ్ చూసి అధికార బీఆర్ఎస్ సైతం ఆందోళన చెందింది. అయితే అదంతా మూణ్నాళ్ల ముచ్చటేనని తేలిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పెరిగినట్టే పెరిగి ఒక్కసారిగా తుస్సుమందని అంటున్నారు.
నేతల చేరికలు
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు పరాజయం తప్పలేదు. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణలో పార్టీ మళ్లీ పుంజుకుంది. నేతల్లో ఆశలు చిగురించాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ ప్రభావం రాష్ట్రంపైనా కనిపించింది. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి సస్పెండైన పొంగులేటి, జూపల్లి తదితర నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. మరికొందరు నేతలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోనూ ఈసారి అధికారంలోకి రావచ్చన్న నమ్మకం కాంగ్రెస్లో బలపడింది.
మారిన పరిస్థితి
నిజానికి కాంగ్రెస్ జోరు చూసి బీఆర్ఎస్ భయపడింది. రేవంత్ రెడ్డి ఛరిష్మా, బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలుంటాయన్న ఊహాగానాలు అధికారపార్టీని ఆందోళనకు గురి చేశాయి. రేవంత్ రెడ్డి చరిష్మాతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందన్న వాదనలు వినిపించాయి. అయితే రోజులు గడవకముందే పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ లో కర్నాటక జోష్ కంటిన్యూ కాలేదు. నేతల పాదయాత్రలు బంద్ అయ్యాయి. అంతర్గత కుమ్ములాటలు మళ్లీ తెరపైకి వచ్చాయి. పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్, గొడవలు తీర్చేందుకే టీపీసీసీ చీఫ్ కు టైం లేని పరిస్థితి నెలకొంది.
జాడలేని అగ్రనేతలు
మరోవైపు పార్టీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారన్న రాష్ట్ర నాయకులు వారితో కనీసం ఓ బహిరంగ సభ ఏర్పాటు చేయలేకపోయారు. మరోవైపు గత నెలలో అమెరికా పర్యటన సందర్భంగా ఉచిత కరెంటుపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రైతులకు కేవలం 3 గంటల విద్యుత్ చాలన్న ఆయన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. ఈ అంశంపై అధికార బీఆర్ఎస్ చేయాల్సినంత రచ్చ చేసింది. దీంతో ఈ అంశం కాంగ్రెస్కు చేయాల్సినంత నష్టం చేసింది.
అసెంబ్లీ సమావేశాల ఎఫెక్ట్
ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ను కడిగిపారేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను, కాంగ్రెస్ పాలకుల డొల్లతనాన్ని సభ సాక్షిగా బజారున పడేశారు. కాంగ్రెస్ కారణంగా తెలంగాణ ఎంత నష్టపోయిందన్న విషయాన్ని సవివరంగా చెప్పారు. అయితే అధికార పార్టీ విమర్శలపై నోరుమెదపకపోవడం కాంగ్రెస్ కు మైనస్ గా మారింది. ఇదే జనాల్లో ఆలోచన రేకెత్తించిందని కాంగ్రెస్ గ్రాఫ్పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిందని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.
సెంటిమెంట్ అస్త్రం
తాజాగా కాంగ్రెస్ అందుకున్న కొత్త రాగం ఆ పార్టీకి మరింత చేటు చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు సర్వశక్తులు ఒడ్డాలని భావిస్తున్న కాంగ్రెస్ ఆకర్షణీయమైన మేనిఫెస్టోతో పాటు సెంటిమెంటును వాడుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా సెంటుమెంట్‌ను మరోసారి తెరపైకి తీసుకురావడమే కాకుండా ఏకంగా అధినేత్రి సోనియాగాంధీ రంగంలోకి దింపాలని భావిస్తోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఓటేయాలని కొత్త రాగం అందుకుంది.
లాజిక్ మిస్
కాంగ్రెస్ అందుకున్న కొత్త రాగం బీఆర్ఎస్ నెత్తిన పాలు పోస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. గత రెండు ఎలక్షన్లలో ఇదే నినాదం అందుకున్నా.. జనం తిరస్కరించి కేసీఆర్ కు పట్టం కట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ నినాదం ఎత్తుకున్నా లాభపడేది కేసీఆరేనని, కాంగ్రెస్ ఆ చిన్న లాజిక్ మిస్సవుతోందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.