Nandikanti Sridhar : కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్

Byline :  Kiran
Update: 2023-10-04 14:49 GMT

కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ఆయన.. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసినా గుర్తింపు లేదని, ఆ పార్టీలో బీసీలకు స్థానం లేదని అర్థంకావడంతో రాజీనామా చేసినట్లు నందికంటి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెమట, రక్తం ధారపోసినా పట్టించుకోలేదని అందుకే బడుగు బలహీన వర్గాలకు మద్దతిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు బీఆర్ఎస్లో చేరినట్లు స్పష్టం చేశారు.

మేడ్చల్ - మల్కాజిగిరి డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిన నందికంటి శ్రీధర్ 1994 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2018లోనే ఆయనకు మల్కాజ్గిరి టికెట్ ఇస్తారని భావించినా పొత్తులో భాగంగా దక్కలేదు. దీంతో ఈసారి ఎన్నికల్లో తప్పకుండా టికెట్ వస్తుందని ఆశించారు. అయితే బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మైనంపల్లి హనుమంతరావును పార్టీలోకి తీసుకోవడం, పార్టీ కోసం ఇన్నాళ్లుగా కష్టపడ్డ తనను కాదని మైనంపల్లి ఫ్యామిలీకి ఏకంగా రెండు టికెట్లు ఇవ్వడంతో నందికంటి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి హామీ రావడంతో నందికంటి శ్రీధర్ గులాబీ కండువా కప్పుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది.

Full View



Tags:    

Similar News