తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారి రాజకీయాలను రోజురోజుకూ రక్తి కట్టిస్తోంది (Malkajgiri Congress Leader ). బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామాతో టికెట్ ఎవరికివ్వాలని అధిష్టానం సాగిస్తున్న కసరత్తు కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదన్న నానుడిని నిజం చేస్తూ అనూహ్యమైన పేర్లు తెరపైకి వస్తున్నాయి. మల్కాజ్‌గిరి-మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ముదిరాజ్ సామాజిక వర్గం నేత నందికంటి శ్రీధర్‌కు టికెట్ దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు!
మైనంపల్లికి ఇస్తే నా పరిస్థితి ఏమిటి?
మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరుతుండడంతో ఆయనకు మల్కాజ్‌గిరి ‘హస్తం’ టికెట్ దక్కుతుందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో అక్కడి నుంచి పోటీచేయాలని నందికంటి పెట్టుకున్న ఆశలు కల్లలయ్యే పరిస్థతి నెలకొంది. మైనంపల్లి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో ఆయనకు టికెట్ గ్యారంటీ అని చెబుతున్నాయి. తనతోపాటు తన కొడుక్కు మెదక్, సన్నిహితుడు నక్కా ప్రభాకర్ రావుకు మేడ్చల్ టికెట్ ఇవ్వాలనే షరతుపైనే మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వినికి. అయితే ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న తనకే టికెట్ వస్తుందని నందికంటి చెప్పారు. టికెట్ ఇవ్వకపోతే తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానని హెచ్చరించారు. అదను కోసం ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ ఆయనతో మంతనాలు సాగించి టికెట్ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. నందికంటి 2014 ఎన్నికల్లో మాల్కాజ్‌గిరి నుంచి పోటీ బీఆర్ఎస్ అభ్యర్థి చింతల కనకారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2018లో తెలంగాణ జనసమితితో పొత్తు కింద కాంగ్రెస్ ఆ సీటును వదులకుంది. దీంతో ఈసారి తనకు గ్యారంటీగా టికెట్ వస్తుందన్న నందికంటి ఆశ.
మరో ఇద్దరు..
మల్కాజ్‌గిరి కాంగ్రెస్ శ్రేణుల్లో నందికందికి పట్టు ఉంది. ఆయనకు టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని బీఆర్ఎస్ భావిస్తోంది. నందికంటికి బరిలోకి దింపితే ముదిరాజ్ వర్గం నేతలకు టికెట్లు ఇవ్వడం లేదన్న విమర్శలకు కూడా బదులు ఇచ్చినట్లవుతుందని గులాబీ దళం ఆలోచన. అయితే మల్కాజ్‌గిరి టికెట్ కోసం పార్టీ నేతల్లో కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో కేసీఆర్ ఆచితూచి స్పందిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. గత పార్లమెంటు ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి మల్కాజ్‌గిరిలో రేవంత్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ సానుభూతి కలిసి వచ్చే అంశమైనా బీసీ అయిన నందికంటికి ఇస్తే ఆ వర్గాన్ని ఆకట్టుకోవచ్చని అధిష్టానం భావిస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి, అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయశాంతి పేర్లను కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారు. తలసాని సాయి గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి బీజేపీ నేత కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలైన చింతల విజయశాంతి జీహెచ్‌ఎంసీ మేయర్ పదవి ఆశించినా ఎంపీ కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మికి దాన్ని కైవసం చేసుకున్నారు. మహిళలకు చట్టసభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లెమెంటు బిల్లును ఆమోదించిన నేపథ్యంలో చింతల విజయశాంతిని బరిలోకి దింపితే మైలేజ్ వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే బలమైన ప్రత్యర్థిపై బలమైన నేతనే బరిలోకి దింపాలి కనుక ఆమె పోటీపై మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ మల్కాజ్‌గిరి టికెట్‌పై తీసుకునే నిర్ణయాన్ని బట్టి బీఆర్ఎస్ పావులు కదిపే ఆలోచనలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వచ్చాక పెండింగ్‌లో ఉన్న మిగిలిన నాలుగు సీట్లకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటిస్తారని భావిస్తున్నారు.