పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేక నజర్ పెట్టింది. తెలంగాణలో 12 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయించాలని భావిస్తోంది. గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సోనియా ఖమ్మం నుంచి పోటీ చేస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్కు మరింత ఊపు రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం నుంచి తాను ఎన్నికల బరిలో ఉంటానని రేణుకా చౌదరి తెలిపారు. సోనియా గాంధీ పోటీ చేయకపోతే.. అక్కడి నుంచి పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ఖమ్మం నుంచి పోటీ అంశంపై సోనియాతో సీఎం రేవంత్ చర్చలు జరుపుతున్నారని చెప్పారు. సోనియా తెలంగాణకు వస్తే అదే తమకు మహాభాగ్యమని వ్యాఖ్యానించారు. అయితే మిగితా నేతలు పోటీ చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కచ్చితంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.