Telangana Congress: కాంగ్రెస్లో చల్లారని అసంతృప్తి సెగలు.. పార్టీ వీడేందుకు సిద్ధమైన మరో నేత..!
కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తి నేతల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పగా.. మరికొందరు త్వరలోనే రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకిచ్చేందుకు మరో నేత సిద్ధమయ్యారు. బీఆర్ఎస్లో చేరే యోచనలో ఉన్న ఆయన.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు.
కాంగ్రెస్ తరఫున జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డికి పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ప్రగతి భవన్ వెళ్లి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. బీఆర్ఎస్లో చేరే అంశంపై చర్చించినట్లు సమాచారం. ఒకవేళ రూట్ క్లియర్ అయితే ఒకట్రెండు రోజుల్లో విష్ణు వర్థన్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరే అవకాశముంది.
వాస్తవానికి విష్ణు జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందని ధీమాతో ఉన్నాడు. నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యాడు. అయితే టికెట్ల కేటాయింపులో హైకమాండ్ ఆయనకు మొండిచేయి చూపింది. ఆ స్థానం నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్కు అవకాశమిచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన విష్ణువర్థన్ శనివారం తన అనుచరులతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఆయన అనుచరులు, అభిమానులు గాంధీ భవన్ చేరుకుని ఆందోళన చేశారు. టికెట్ దక్కలేదని తీవ్ర అసంతృప్తి ఉన్న విష్ణువర్థన్ రెడ్డి కార్యకర్తల అభిప్రాయం మేరకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.