సాయంత్రం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించనున్న కాంగ్రెస్..?

Byline :  Kiran
Update: 2024-01-16 09:33 GMT

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు స్థానాల్లో బరిలో నిలిపే అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడైన అద్దంకి దయాకర్తో పాటు NSUI రాష్ట్ర ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ కు కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి టికెట్ ఆశించారు. అయితే పార్టీ నిర్ణయం మేరకు ఆ టికెట్ త్యాగం చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మందుల సామేలుకు టికెట్ ఇవ్వగా ఆయన ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఏఐసీసీ అద్దంకి అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఒకవేళ ఆయనకు అవకాశమిస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఓ ఎమ్మెల్సీ పదవి దక్కినట్లే అవుతుంది.

ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మరో స్థానం నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ను బరిలో నిలుపుతారన్న ఊహాగానాలు వినిపించాయి. అదే సమయంలో మైనార్టీ నేతను ఎమ్మెల్సీగా చట్టసభకు పంపి కేబినెట్లో అవకాశమివ్వాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వ్చచాయి. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీకి ఆ ఛాన్స్ దక్కవచ్చని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం వారిద్దరినీ కాదని అనూహ్యంగా NSUI రాష్ట్ర ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ పేరు ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో వారు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆ రెండు స్థానాల భర్తీ కోసం ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 18ను చివరి తేదీకాగా.. కాంగ్రెస్ మంగళవారం అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 29 రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక జరగనుండగా.. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.

శాసన సభలో ఎమ్మెల్యేల బలాబలాల దృష్ట్యా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే ఎన్నిక నిర్వహిస్తే వాటిలో ఒకటి కాంగ్రెస్, మరొకటి బీఆర్ఎస్ కు దక్కేది. అయితే ఈసీ విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆ రెండు స్థానాలు కూడా అధికార కాంగ్రెస్ ఖాతాలోనే పడనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే కానుంది. ఇదిలా ఉంటే శాసన మండలిలో ప్రస్తుతం వివిధ కోటాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఎమ్మెల్యే కోటా, గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలు అధికారపార్టీకి దక్కనున్నాయి.

Tags:    

Similar News