కాంగ్రెస్లో కొనసాగుతున్న సస్పెన్స్.. ఫైనల్ లిస్టు ఎప్పుడంటే..?

By :  Kiran
Update: 2023-11-01 16:32 GMT

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు మరో 29 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. అయితే కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించలేదు. శుక్రవారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఫైనల్ లిస్టుపై పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు.

కాంగ్రెస్ హైకమాండ్ నవంబర్ 2 లేదా 3వ తేదీన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేస్తుందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ఫస్ట్ లిస్టులో 55 మంది, రెండో జాబితాలో 45 మంది పేర్లు ప్రకటించిన ఆ పార్టీ మిగిలిన 19 స్థానాల్లో బరిలో దింపే అభ్యర్థుల్ని ఇంకా ఖరారు చేయలేదు. కమ్యూనిస్టు పార్టీలతో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాకపోవడంతోనే ఫైనల్ లిస్టు రిలీజ్ చేయడంలో ఆలస్యమవుతోందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు తన పేరు రెండు జాబితాల్లో లేకపోవడంపై షబ్బీర్ అలీ స్పందించారు. పార్టీ హైకమాండ్ తనను ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి బరిలో దిగుతానని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే పలు డిక్లరేషన్లతో పాటు ఆరు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మైనార్టీ, బీసీ డిక్లరేషన్లు రిలీజ్ చేస్తుందని షబ్బీర్ అలీ చెప్పారు. రూ.5వేల కోట్లతో మైనార్టీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని సూచించామని అన్నారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశంపై న్యాయపరంగా ముందుకెళ్లనున్నట్లు ప్రకటించారు.




Tags:    

Similar News