కాంగ్రెస్లో కొలిక్కి టికెట్ల వ్యవహారం.. దసరా తర్వాతే సెకండ్ లిస్ట్

By :  Kiran
Update: 2023-10-22 07:13 GMT

అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. ఇప్పటికే బస్సు యాత్రతో ప్రచారం ఉద్ధృతం చేసిన ఆ పార్టీ అభ్యర్థుల ప్రకటన విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. 55 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన కాంగ్రెస్.. రెండో జాబితా మాత్రం దసరా తర్వాతే ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ఇంకా 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే బరిలో నిలిపే అభ్యర్థులను దాదాపు ఫైనల్ చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 25 లేదా 26న కాంగ్రెస్‌ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. అవసరమైతే అభ్యర్ధులతో మాట్లాడి ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే సీట్ల కేటాయింపులో భాగంగా కమ్యూనిస్టు పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. చెన్నూరు నుంచి సీపీఐ అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే చెన్నూరు అభ్యర్థిని ప్రకటించక ముందే సీపీఐకి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నూరులో పోటీ చేయడంపై సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ స్థానం నుంచి సీపీఐ అక్కడ పోటీ చేయొద్దంటూ తీర్మానం చేసింది. చెన్నూర్ టిక్కెట్ తీసుకునే ప్రతిపాదనను విరమించుకోవాలని మందమర్రి కార్మిక సంఘం విభాగం కోరింది.


Tags:    

Similar News