కాంగ్రెస్కు హ్యాండిచ్చి కారెక్కనున్న జగ్గారెడ్డి.. పార్టీ మారడం వెనుక స్టోరీ ఇదేనా..?

Update: 2023-08-11 02:43 GMT

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొంతకాలంగా మౌనం వహించారు. స్వపక్షంలో విపక్షం పాత్ర పోషించే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గాంధీభవన్‌వైపు వెళ్లడమే మానేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ ను కలిసిన ఆయన తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. జగ్గారెడ్డి సడెన్‌గా బీఆర్‌ఎస్‌తో టచ్‌లోకి వెళ్లడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన గులాబీ గూటికి చేరిపోతారన్న వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 18 తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

పరిస్థితుల ప్రభావం

జగ్గారెడ్డికి కాంగ్రెస్ అంటే అమితమైన ప్రేమ. గాంధీ కుటుంబమంటే చెప్పలేనంత అభిమానం. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సంగారెడ్డిలో తన పట్టు ఎలాంటిదో చూపెట్టారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ లో కొనసాగితే ఓటమి తప్పదని అందుకే పార్టీ మారాలని జగ్గారెడ్డి ఆలోచిస్తున్నారట. పరిస్థితుల ప్రభావంతో ఆయన నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. రాజకీయంగానే కాక వ్యక్తిగతంగానూ కొన్ని సమస్యలు ఉన్నాయని వాటి నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆర్థిక సమస్యలు

నిజానికి జగ్గారెడ్డికి కాంగ్రెస్ టికెట్ కన్ఫామ్ అయినట్లే. అయినా ఆర్థిక, వ్యక్తిగత సమస్యల కారణంగా కారణంగా ఆయన కాంగ్రెస్కు హ్యాండిచ్చి కారెక్కేందుకు సిద్ధమయ్యారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. జగ్గారెడ్డికి పటాన్ చెరు ప్రాంతంలో భూములున్నాయి. అయితే అవి లిటిగేషన్లో ఉన్నాయట. భూముల సమస్యను పరిష్కరించుకునేందుకు అధికార పార్టీ అండ అవసరం. మరోవైపు జగ్గారెడ్డి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనకు భారీగా అప్పులున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ గెలుపుపై అనుమానం

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గమనిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. జనం మళ్లీ బీఆర్ఎస్ కే పగ్గాలు అప్పజెప్తే అవకాశమున్న అంచనాతో జగ్గారెడ్డి పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ను వీడే సమయంలో ఇతర నాయకుల్లా వ్యవహరించకూడదని ఆయన నిర్ణయించుకున్నారట. కాంగ్రెస్ పార్టీపై గానీ పార్టీ నాయకులపై ఎలాంటి విమర్శలు చేయకూడదని డిసైడైనట్లు సమాచారం.

ఆగస్టు 18 తర్వాత ముహూర్తం

జగ్గారెడ్డి గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమైనప్పటికీ మంచి ముహూర్తాలు లేకపోవడంతో పార్టీలో చేరడం ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. శుక్ర మౌడ్యం పూర్తయ్యే వరకు ఆగాలని సీఎం కేసీఆర్ జగ్గారెడ్డికి చెప్పినట్లు సమాచారం. ఆగస్టు 17 న శుక్రమౌడ్యం ముగుస్తుంది. దీంతో ఆగస్టు 18 నుంచి 25 మధ్యన జగ్గారెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే ఛాన్సుంది. ఇదిలా ఉంటే జగ్గారెడ్డి సన్నిహుతులు మాత్రం పార్టీ మార్పు అంశాన్ని కొట్టి పారేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ లో చేరే ప్రసక్తేలేదని అంటున్నారు. 


Full View



Tags:    

Similar News