Congress Bus Yatra: కాంగ్రెస్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం.. ఎప్పట్నుంచంటే..
అసెంబ్లీ ఎన్నికలకు మరో నెలన్నర మాత్రమే సమయం ఉండటంతో ప్రచారం ముమ్మరం చేయాలని టీ కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా బస్సు యాత్రకు సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కీలక నేతలందరూ ఈ బస్సు యాత్రలో పాల్గొని ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
ఆదివారం 55 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన కాంగ్రెస్ మరో రెండు రోజుల్లో మిగిలిన పేర్లు కూడా ఖరారు చేయనుంది. 18లోపు అభ్యర్థులందరినీ ప్రటించిన ఆ తర్వాత కాంగ్రెస్ బస్సు యాత్ర మొదలుపెట్టాలని భావిస్తోంది. ఈ బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం పాల్గొననున్నారు. 3 రోజుల పాటు ఆయన యాత్రలో పాల్గొనేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ సైతం ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు గ్యారెంటీలను బస్సు యాత్ర ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో పాటు కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా ప్రణాళిక సిద్ధం సిద్ధం చేసినట్లు సమాచారం. యాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నారు. బస్సు యాత్రకు సంబంధించి ఇప్పటికే రూట్‌మ్యాప్ ఖరారు కాగా.. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.