అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్.. బీఆర్ఎస్కు అంతుచిక్కకుండా కాంగ్రెస్ ప్లాన్..

Byline :  Kiran
Update: 2023-10-02 15:52 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ రానుంది. దీంతో రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాలకు పదునుపెంచాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించగా.. బీజేపీ అక్టోబర్ రెండో వారంలో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించినా.. ఇప్పటి వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించలేదు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ రెండు దఫాలు భేటి అయినా.. ఇప్పటి వరకు కనీసం ఫస్ట్ లిస్టు కూడా అనౌన్స్ చేయలేదు. అయినా ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. వరుస చేరికలతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఇంతకీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించకపోవడం వెనుక వ్యూహమేమైనా ఉందా? కేవలం పార్టీలు హామీలు, గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకుపోవడం దేనికి సంకేతం?

పెరిగిన వలసలు

ఎన్నికలకు నాలుగు నెలల ముందే బీఆర్ఎస్ పార్టీ.. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఖరారు చేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం క్యాండిడేట్స్ లిస్టు ఫైనల్ చేయకుండా.. తమ పార్టీ అధికారంలోకొస్తే తీసుకొచ్చే స్కీముల్ని ప్రకటిస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దీని వెనుక కాంగ్రెస్ పెద్ద స్కెచ్ ఉన్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్లోకి వలసలు పెరిగాయి. గతంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి ఎవరు వస్తారా అని కాంగ్రెస్ ఎదురుచూసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్సైంది. బీజేపీ, బీఆర్ఎస్ కు చెందిన పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.

అంతుపట్టని వ్యూహం:

కాంగ్రెస్ వ్యూహాలను కేసీఆర్ ముందే పసిగట్టేవారు. కాంగ్రెస్ ఏ నియోకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తుందో ఊహించేవారు. దాని ఆధారంగా బీఆర్ఎస్ ఎత్తులు ఉండేవి కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహాలేవీ అధికార పార్టీకి అంతుచిక్కడం లేదు. బీఆర్ఎస్ లో.. తమ పార్టీ నేతల్నే కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నికల సమయంలో కేసీఆర్.. అవతలి పార్టీలను వీక్ చేసే వారు. కానీ ఇప్పుడు దానికి బ్రేక్ పడినట్టే అనిపిస్తుంది.

సర్వేలకే ప్రాధాన్యం:

కాంగ్రెస్ వ్యూహాల్లో సునీల్ కనుగోలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి అభ్యర్థుల ఎంపికకు కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చిన కాంగ్రెస్.. పోటీ చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీల్పీ భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటుచేసింది. వీరంతా కొంతమంది అభ్యర్థులను ఫైనల్ చేసి ఆ లిస్టును అధిష్టానికి పంపారు. అయితే రోజులు గడుస్తున్నా బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు మాత్రం బయటకు రావడం లేదు. అయితే ఈ ఆలస్యానికి చాలా కారణాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్క్రీనింగ్ కమిటీ సభ్యులైన రేవంత్, భట్టి, ఇతర నేతలు తమ వర్గానికి చెందిన నేతల పేర్లను ఫైనల్ చేసి హైకమాండ్ కు పంపారని, అందుకే అధిష్టానం ఇంకా ఆ పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. స్క్రీనింగ్ కమిటీ పంపిన అభ్యర్థుల్ సర్వే రిపోర్టుల ఆధారంగా హైకమాండ్ అభ్యర్థుల్ని ఫైనల్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

మారిన తీరు

రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు కోసం.. సునీల్ కనుగోలు, ప్రియాంక, రాహుల్ చేయాల్సిందంతా చేస్తున్నట్లు సమాచారం. ఫలానా వ్యక్తికే టికెట్ ఇవ్వాలని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు పట్టుబట్టినా.. పట్టించుకునే పరిస్థితి కనిపించడంలేదని టాక్ వినిపిస్తోంది. అవసరమనుకుంటే సభ్యులు సిఫార్సు చేసిన అభ్యర్థులపై మళ్లీ రీసర్వే జరిపిస్తున్నారని సమాచారం.

గెలుపు గుర్రాల కోసం

ఇదిలా ఉంటే గెలుపు గుర్రాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ వలసలు కొనసాగుతున్నందునే హైకమాండ్ ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించడంలేదని ప్రచారం సాగుతోంది. సర్వే ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ప్రకటించిన పార్టీ.. మరికొంతకాలం పాటు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకునేవారి కోసం వేచి చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. గెలుపు కష్టమేనని భావిస్తున్న అభ్యర్థుల స్థానంలో ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి అవకాశమివ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ వలసలను ప్రోత్సహిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి.. పార్టీలోకి కొత్తగా వచ్చే వారి కోసం 10 సీట్లు దాచినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తమ్మీద ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టును ప్రకటించే అవకాశం ఉంది. 




Tags:    

Similar News