Rahul Gandhi Yatra : మార్చి నుంచి రాహుల్ మరో యాత్ర.. పేరు మార్పు..

By :  Kiran
Update: 2024-01-04 13:34 GMT

లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ వ్యూహాలకు పదునుపెడుతోంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో తరహాలో మరో యాత్రకు సిద్ధమవుతోంది. తొలుత దీనికి భారత్ న్యాయ్ యాత్ర అని పేరు పెట్టగా.. తాజాగా చిన్న మార్పు చేశారు. తాజాగా దీనికి ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ప్రకటించారు. గురువారం ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్‌ ఖర్గే నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో యాత్ర పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’కు ఇండియా కూటమి నేతలందరినీ ఆహ్వానిస్తున్నట్లు జైరాం రమేష్ అన్నారు.

జనవరి 14న ప్రారంభమయ్యే భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 30న ముగియనుంది. 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా 66 రోజులపాటు దాదాపు 6,713 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. దాదాపు 100 లోక్‌సభ స్థానాలను కవర్ చేసేలా యాత్ర జరగనుంది. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే యాత్ర.. అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్రల మీదుగా సాగుతుంది.

భారత్‌ జోడో యాత్ర పాదయాత్ర కాగా.. న్యాయ్‌ యాత్ర మాత్రం బస్సుల్లో కొనసాగుతుంది. అయితే మధ్యమధ్యలో మాత్రం పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. గతంలో రాహుల్‌ గాంధీ.. 2022లో రాహుల్ గాంధీ కన్యా కుమారి నుంచి కశ్మీర్‌ వరకు 136 రోజులపాటు 12 రాష్ట్రాల్లో దాదాపు 4,500 కిలోమీటర్ల మేర జోడో యాత్ర చేపట్టారు.




Tags:    

Similar News