ముగ్గురు అభ్యర్థులకు కాంగ్రెస్ షాక్.. బీ ఫాంలు నిలిపేసిన హైకమాండ్..
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్థులకు షాకిచ్చింది. స్థానిక నేతల నుంచి ఫిర్యాదులు అందడంతో వారికి బీఫాంలు నిలిపివేసింది. రెండు విడతల్లో 100 మంది పేర్లు ప్రకటించిన కాంగ్రెస్.. తాజాగా చేవెళ్ల, వనపర్తి, బోథ్ నియోజకవర్గాల అభ్యర్థులకు ఝలక్ ఇచ్చింది.
కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫాంలు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నుంచి ప్రారంభించారు. తొలిరోజు దాదాపు 60 మంది అభ్యర్థులకు బీఫాంలు ఇవ్వగా.. గతంలో ప్రకటించిన 100 మంది పేర్లలో కొన్ని మార్పులు చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల ప్రకటన తర్వాత చేయించిన సర్వే.. 9 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు బలహీనంగా ఉన్నట్టు తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చేవెళ్ల, వనపర్తి, బోథ్ నియోజకవర్గాలకు చెందిన బీఫాంలు నిలిపివేయాలని హైకమాండ్ పీసీసీని ఆదేశించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బోథ్ నుంచి వెన్నెల కిశోర్, వనపర్తి నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, చేవేళ్ల నుంచి పామెన భీం భరత్‌లకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.