ఎటూ తేల్చని స్క్రీనింగ్ కమిటీ.. ఫస్ట్ లిస్ట్ ఇప్పట్లో లేనట్లేనా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 నెలలు మాత్రమే ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ జోరు పెంచాయి. బీఆర్ఎస్ ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీలు సరైన అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సైతం క్యాండిడేట్ల వడపోత ప్రక్రియలో వేగం పెంచింది. అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. అయితే అభ్యర్థుల ఎంపికపై కమిటీ సభ్యులు తుది నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది.
పార్టీ అంతర్గత సర్వేలు, సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల లిస్టు సిద్ధం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఈ క్రమంలోనే స్క్రీనింగ్ కమిటీ వచ్చే వారం మరోసారి భేటీ అయ్యే అవకాశముంది. ఆ మీటింగ్ లో అభ్యర్థులను ఫైనల్ చేసి హైకమాండ్ కు పంపనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో నిర్వహించే సీడబ్ల్యూసీ సమావేశం తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.
రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే అప్లికేషన్లు స్వీకరించింది. దాదాపు వెయ్యి మందికిపైగా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 4 నుంచి జాబితా తయారీపై కసరత్తు ప్రారంభించిన స్క్రీనింగ్ కమిటీ.. తొలుత ప్రదేశ్ ఎన్నికల కమిటీ అభిప్రాయం తీసుకుంది. అనంతరం పీఈసీలో లేని సభ్యులు, మాజీ కార్యదర్శులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో కమిటీ ఛైర్మన్ మురళీధరన్.. వన్ టు వన్ భేటీ నిర్వహించారు. వారి అభిప్రాయాల మేరకు ఒక్కో నియోజకవర్గానికి 1 నుంచి 3 పేర్లను కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ క్రమంలో స్క్రీనింగ్ కమిటీ తదుపరి సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది.