వాళ్లను కాదని.. వివేక్ వెంకటస్వామికి చెన్నూరు టికెట్..!

Byline :  Bharath
Update: 2023-11-04 03:57 GMT

బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపుల కమిటీ చైర్మన్ జానారెడ్డిని ఆ పార్టీ నేత నల్లాల ఓదెలు కోరారు. శుక్రవారం జానారెడ్డి నివాసంలో చెన్నూరు నేతలతో వివేక్ వెంటకస్వామి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వివేక్ లాంటి సీనియర్ లీడర్ కు టికెట్ ఇస్తే.. ఆయన గెలుపు కోసం ఎలాంటి భేషాజాలు లేకుండా పనిచేస్తామని ఓదెలు చెప్పుకొచ్చారు. అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని.. నిలబడ్డ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తామని అన్నారు.

తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ.. ఆవిడ కోసం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. కాగా కాంగ్రెస్ ప్రకటించాల్సిన 19 నియోజకవర్గాల్లో చెన్నూరు కూడా ఒకటి. ఆదివారం కాంగ్రెస్ మూడో లిస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సీనియర్ లీడర్లు చెప్తున్నారు. బీసీ స్థానాలపై నెలకొన్న సందిగ్ధత పోయినట్లు తెలుస్తుంది. మిగిలిన 19 స్థానాల్లో బీసీలకు మరో 4 స్థానాలు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, మొదట చెన్నూరు టికెట్ కోసం నూకల రమేష్, రాజా రమేష్, దుర్గం భాస్కర్, దాసరి శ్రీనివాస్, నల్లాల ఓదెలు అప్లై చేసుకున్నారు. వారిని కాదని నిన్న జాయిన్ అయిన వివేక్ వెంకటస్వామికి టికెట్ ఇస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News