Congress Bus Yatra: కాంగ్రెస్ బస్సు యాత్రకు బ్రేక్.. కారణం అదేనా..?
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న విజయభేరి బస్సు యాత్ర వాయిదా పడింది. అక్టోబర్ 30 సోమవారం భువనగిరి పార్లమెంటు పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల యాత్ర వాయిదా వేసింది. ఈ విషయాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామన్నది త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. అయితే సోమవారం యాత్రలో పాల్గొనాల్సిన ముఖ్య అతిధి రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారు కాకపోవడంతోనే బస్సు యాత్ర వాయిదా పడినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 30న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భువనగరి పార్లమెంట్ సెగ్మెంట్‌లోని జనగామ, ఆలేరు, భువనగిరి, 31న నల్గొండ పార్లమెంట్సెగ్మెంట్లోని నాగార్జునసాగర్, నాగర్ కర్నూల్ సెగ్మెంట్లోని కొల్లాపూర్‌లో బస్సు యాత్రలో పాల్గొనాల్సి ఉంది. ఇక నవంబర్ 1న రాహుల్ గాంధీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లోని కల్వకుర్తి, మహబూబ్నగర్ సెగ్మెంట్లోని జడ్చర్ల, షాద్ నగర్, నవంబర్ 2న మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో నిర్వహించే బస్సు యాత్రల్లో పాల్గొంటారని కాంగ్రెస్ ప్రకటించింది. తాజాగా ఈ యాత్ర తాత్కాలికంగా వాయిదా పడినట్లు ప్రకటించింది.
ఇదిలా ఉంటే అనివార్య కారణాల వల్ల యాత్ర వాయిదా పడిందని చెబుతున్నా దాని వెనుక కారణం వేరే ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టికెట్ రాని అసంతృప్త నేతలు అసమ్మతి గళం వినిపిస్తుండటం, రాజీనామాలు చేస్తుండటం, మరికొందరు వేరే పార్టీల్లో చేరుతుండటంతో వారిని బుజ్జగించిన తర్వాతే యాత్ర మొదలు పెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.