బీఆర్ఎస్కు షాక్.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు విడివిడిగా నోటిఫికేషన్లు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఈనెల 29న జరగనున్న ఉప ఎన్నికల్లో రెండు సీట్లూ అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడనున్నాయి. రెండు ఖాళీల భర్తీకి విడివిడిగా ఎన్నికలు నిర్వహించనుండటంతో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా దక్కే అవకాశంలేకుండా పోయింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అసెంబ్లీ సెక్రటేరియేట్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో రెండు స్థానాలకు విడివిడిగా ఎన్నిక నిర్వహించనున్నట్లు చెప్పింది. దీంతో ఒక్క సీటైనా దక్కుతుందన్న బీఆర్ఎస్ ఆశలు గల్లంతయ్యాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో రెండు సీట్లు ఖాళీ అయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం రెండు సీట్లకు ఒకే ఎన్నిక నిర్వహిస్తే వాటిలో ఒకటి కాంగ్రెస్, మరొకటి బీఆర్ఎస్ ఖాతాలో పడతాయి. అయితే ఈ రెండు స్థానాల ఉప ఎన్నిక కోసం విడివిడిగా నోటిఫికేషన్లు, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో రెండు సీట్లకు విడివిడిగా పోలింగ్ జరగనుంది. ఒక ఎమ్మెల్సీ స్థానం ఎన్నికకు వైట్ బ్యాలెట్ పేపర్, మరో ఎమ్మెల్సీ పోలింగ్కు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ ఉపయోగించనున్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 119 కాగా.. కాంగ్రెస్కు 64మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ బలం 39 కాగా.. దాని మిత్రపక్షమైన ఎంఐఎంకు 7, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రెండు స్థానాలకు విడివిడిగా ఎన్నిక జరగనున్నందున 119 మంది సభ్యులు రెండుసార్లు ఓట్లు వేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమం ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది. చెల్లిన ఓట్లలో 50శాతానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఈ లెక్కన చూస్తే 119 ఓట్లలో సగం 59.5. అంటే 60 ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎమ్మెల్సీగా ఎన్నికవుతాడు.
ప్రస్తుతం విడివిడిగా ఎన్నిక జరుగుతున్నందున కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచే అభ్యర్థికి సీపీఐ సభ్యుడితో కలుపుకొని 60కిపైగా ఓట్లు వస్తాయి. ఫలితంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడతాయి. అదే ఒకే ఎన్నిక జరిగితే మొదటి ప్రాధాన్యతా ఓట్లు ఆ తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వచ్చిన అభ్యర్థిని ఎమ్మెల్సీగా ప్రకటిస్తారు. ఈ లెక్కన బీఆర్ఎస్ అభ్యర్థికి ఆ పార్టీతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేల ఓట్లు కలిపితే 46 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చేవి. దీంతో బీఆర్ఎస్కు ఓ ఎమ్మెల్సీ సీటు దక్కేది.