ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని ఆశించిన సీపీఐ, సీపీఎంలకు గులాబీ బాస్ గట్టి షాక్ ఇచ్చారు. దీంతో సీపీఐ - కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు నడుస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే అది అవాస్తవమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్తో ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. సీపీఎంతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని కూనంనేని స్పష్టం చేశారు.
మరోవైపు కామ్రేడ్స్తో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. సీపీఐ నేతలకు కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్రావు ఠాక్రే ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సీట్ల అంశం తేలితేనే పొత్తుపై ముందుకెళ్తామని కామ్రేడ్స్ అంటున్నారు. పాలేరు, కొత్తగూడెం, హుస్నాబాద్, బెల్లంపల్లి, మునుగోడు స్థానాల కోసం సీపీఐ పట్టుబడుతుండగా.. మునుగోడు, హుస్నాబాద్ టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
మునుగోడు ఉపఎన్నికలో సీపీఐ, సీపీఐ బీఆర్ఎస్ కు మద్ధతు ఇచ్చాయి. దీంతో ఆ ఎన్నికలో కారు పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్తో సీపీఐ, సీపీఎం నేతలు భావించిగా.. కేసీఆర్ వారికి షాకిచ్చారు. సీపీఐ, సీపీఎం అడిగిన స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ పార్టీల నేతలు.. కలిసి పోటీ చేస్తామని ప్రకటించాయి. అంతేకాకుండా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు.