కాంగ్రెస్తో పొత్తు లేదు.. 17 స్థానాల్లో ఒంటరి పోరు - తమ్మినేని
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోటీకి సీపీఎం సిద్ధమైంది. కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకున్న ఆ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. రెండు మూడ్రోజుల్లో అభ్యర్థుల్ని ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. భద్రాచలం, అశ్వారావుపేటతో పాటు ఖమ్మం జిల్లాలో 5 స్థానాలు, నల్గొండలో 3, సూర్యాపేట జిల్లాలో 2 స్థానాల్లో తమ అభ్యర్థిని బరిలో దింపుతామని చెప్పారు.
వైరా సీటును సీపీఎంకు ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరినట్లు తమ్మినేని చెప్పారు. భద్రాచలం, పాలేరు ఇవ్వాలని తొలుత అడిగామని అన్నారు. అయితే వైరా, మిర్యాలగూడ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత వైరా సీటు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేమని చెప్పారని మండిపడ్డారు. చర్చల్లో భాగంగా తాము ఎన్నోమెట్లు దిగి వచ్చినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. మిర్యాలగూడతో పాటు హైదరాబాద్‌లో ఒక స్థానం ఇస్తామని ప్రస్తుతం కాంగ్రెస్ చెబుతోందని, పరిస్థితులు గమనిస్తే తమతో పొత్తు వద్దని ఆ పార్టీ భావిస్తున్నట్లు అర్థమవుతోందని అన్నారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయన్న తమ్మినేని.. కాంగ్రెస్ నేతల వైఖరి సీపీఎంను ఎంతో బాధించిందని.. కమ్యూనిస్టులకు విలువ ఇవ్వనందునే కాంగ్రెస్‌తో సీసీఎం పొత్తు ఉండదని తేల్చి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.