పోలీస్ స్టేషన్ ఫేస్బుక్ అకౌంట్లో అశ్లీల వీడియోలు.. అసలేం జరిగిందంటే..
సైబర్ నేరగాళ్లు బరితెగించారు. ఏకంగా పోలీసులకే ఝలక్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేసి అందులో పోర్న్ వీడియోలు పోస్ట్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలను డిలీట్ చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ పేజీని హ్యాక్ చేసిన కేటుగాళ్లు అందులో అశ్లీల వీడియోలు పోస్ట్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. .ఆసిఫ్‌నగర్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ రవీందర్‌బాబు బుధవారం రాత్రి స్టేషన్ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. కొన్ని నిమిషాల తర్వాత ప్రయత్నించినా అదే పరిస్థితి ఉండడంతో తన ఫోన్‌లో ఆ అకౌంట్ ను పరిశీలించాడు. అందులో ఐదు అశ్లీల వీడియోలు కనిపించడంతో వెంటనే ఉన్నతాధికారులకు చెప్పాడు. ఎఫ్బీ అకౌంట్ హ్యాక్ గురైనట్లు గుర్తించారు.
పోలీసు అధికారులు వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు. వారు ఫేస్ బుక్ ప్రతినిధులను సంప్రదించి తిరిగి అకౌంట్ను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. హ్యాకర్లు పోస్ట్ చేసిన వీడియోలను డిలీట్ చేశారు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ పేజీకి 6 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్ బుక్ పేజీని హ్యాక్ చేసి అందులో అశ్లీల చిత్రాలు అప్ లోడ్ చేయడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. హ్యాకర్లను పట్టుకునే పనిలో పడ్డారు.