Cyberabad Police : న్యూఇయర్ వేడుకల వేళ పోలీసుల ఆంక్షలు..
మరికొన్ని గంటల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా 31 రాత్రి నుంచి జనవరి 1 అర్ధరాత్రి దాటే వరకు హుస్సేన్‌సాగర్ చుట్టూ (ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు) వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీసు కమిషనర్ కె.శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జనవరి 1న రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు (పీఎన్‌ఆర్ మార్గ్), అప్పర్ ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలు నిలిపివేస్తామని పేర్కొన్నారు. నూతన ఏడాదిలో కొత్త ఆశలు, ఆశయాలతో ప్రయాణం ప్రారంభించే యువత క్షణికావేశంలో తప్పులు చేసి ముప్పు తెచ్చుకోవద్దని సీపీ సూచించారు. శాంతిభద్రతల నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఆదివారం (డిసెంబరు 31) పోలీసు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.
డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11 నుంచి ఉదయం ఉదయం 5 గంటల వరకు పలు ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. వీటిలో శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు, షేక్‌పేట్, మైండ్‌స్పేస్, రోడ్ నంబర్ 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్, ఫోరమ్ మాల్-JNTU, ఖైత్లాపూర్, బాబు జగ్జీవన్ రామ్ (బాలానగర్), AMB, కొండాపూర్ ఫ్లై ఓవర్లను మూసివేయనున్నారు. ఈ నిషేధిత సమయాల్లో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
సైబరాబాద్ వ్యాప్తంగా రాత్రంతా బ్రీత్ ఎనలైజర్ తనిఖీలు నిర్వహించనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వ్యక్తులు వారి లైసెన్సులను జప్తు చేసి సస్పెన్షన్ కోసం రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీకి పంపుతారు. రాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితిమీరిన హారన్, ప్రమాదకరమైన డ్రైవింగ్, ట్రిపుల్ / మల్టిపుల్ రైడింగ్ వంటివి సహించబడవు. కఠినమైన చట్టపరమైన చర్యలను తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
అలాగే.. బార్‌లు, పబ్బులు, క్లబ్బుల్లో.. న్యూఇయర్ వేడుకల్లో మద్యం సేవించిన వారు స్వయంగా వాహనాలు నడిపేందుకు అనుమతించొద్దని పేర్కొన్నారు. ఒకవేళ అలా చేస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిబంధనలకు ప్రజలు సహకరించి బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. వ్యక్తులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని తెలిపారు.